ప్రియమయిన నా తోటి యువకుల్లారా,
ఒక్క పూట ముద్ద లేకపోతే అల్లాడిపోయే మనం, ఆ ముద్దనందించే రైతన్నకు మద్దతుగా నిలవేలమా...మద్దతు ధర కోసం రైతన్న పడుతున్న ఆరాటం చూసి పోరాటం మొదలెట్టిన చంద్రన్నకు మద్దతుగా ముందుకు రాలేమా...రైతు మన జీవితంలో ఒక భాగం కాదా?? వంచనకు గురవుతున్న ఆ కర్షకుల కన్నీళ్లు మన మనసుల్ని కదిలించటం లేదా??
రైతే రాజు అన్నారు... రైతు రాజ్యం తెస్తాము అన్నారు...కానీ ఆ రైతన్న పంట వరదలలో కొట్టుకుపోతుంటే మాత్రం మొద్దు నిద్ర నటిస్తున్నారు...రైతన్న కన్నీటితో ఈ రాష్ట్రం తడిసిపోతున్నా గాని, కుర్చీని కాపాడుకునే పనిలో పడ్డ ముఖ్యమంత్రి గారు విందు పార్టీలతో పసందు చేసుకుంటున్నారు... నేను సైతం రైతు బిడ్డనే అని చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి, "వరి" పంట పండించే అమలాపురం వెళ్లి "వేరుశనగ" పంట గురుంచి వాకబు చెయ్యటం చెబుతుంది, వ్యవసాయం మీద ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ వుందో..ఆ రైతన్న కొచ్చే ఫలసాయం మీద ఎంత అవగాహన వుందో....
దేశానికి రైతే వెన్నెముక అంటున్నాము.. మరి ఎముకలు విరిగేల ఆరుకాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కుల్లిపోతుంటే కళ్ళు వుండి చూడలేని ఈ దృతరాష్ట్ర పాలకులను ముళ్ళు కర్రతో పొడిచి లేపాలిసిన తరుణం ఆసన్నమయినది.....ఆ రైతన్నలకు అండగా "చంద్రబాబు నాయుడు" చేస్తున్న పోరాటంలో మన వంతు పాత్ర పోషించాలిసిన తరుణం వచ్చింది ...
నాడు, వ్యవసాయంలో ఆధునిక పద్దతులు పాటించండి,వ్యవసాయానికి సాంకేతికతను జోడించి అదిక లాభాలను పొందండి అని చంద్రబాబు చెప్పిన మాటకు వక్రభాష్యం చెప్పి ,మోసపూరిత మాటలతో పదవి చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.... నేడు వరదలలో పంట నష్టానికి చేస్తున్న సాయం చూసి రైతన్న చిన్నబుచ్చుకుంటున్నాడు..
ఉద్యోగాల కోసం విద్యార్ధులు ధర్నాలు చేస్తున్నారు.. జీతాల పెంపు కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.. డిమాండ్ల సాధన కోసం లాయర్లు,డాక్టర్లు సమ్మె బాట నడుస్తున్నారు..కొన్ని సార్లు వీళ్ళ డిమాండ్లకు ప్రభుత్వాలు తలొగ్గి కాళ్ళ బేరాలకి సైతం వస్తున్నాయి....మరి వీళ్ళందరికీ అన్నం పెట్టె రైతన్న కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటే ఎం చెయ్యాలి?..అందరి లాగే తానూ కూడా సమ్మె బాట పట్టి, పంట వెయ్యకుండా పొలాలను బీళ్లుగా పెట్టాలా??..నిజంగా అలా పెడితే దేశం తట్టుకోగలదా?? ప్రజలను ఆ ఆకలి చావుల నుండి దేవుడైన కాపాడగలడా???..ఇంత తెలిసి ఎందుకు మరి రైతన్న అంటే అంత చులకనా???...
దుక్కి దున్నిన నాటి నుండి పంట నూర్పే వరకు, విత్తనాల కోసం ఎరువుల కోసం,తెగుల్ల నుండి పంటను కాపాడుకోవటం కోసం అనునిత్యం పోరాడిన రైతన్న ఆ పంట చేతికొచ్చే సమయంలో మాత్రం మద్ధతు ధర కల్పించలేని పాలకుల చేతిలో ఓడిపోవటం నిజంగా సిగ్గుచేటు..విత్తు నాటిన నుండి పంట చేతికొచ్చే వరకు ఒక ఎకరాకు అవుతున్న పెట్టుబడి ఎంత? వస్తున్న దిగుబడి ఎంత? అన్న కనీస అవగాహన ఈ పాలకులకుంటే రైతన్నకి నేడు ఇంత కష్టం వచ్చుండేది కాదు....ఇన్ని రైతు ఆత్మహత్యలు ఉండేవి కావు ...రైతు కంట ఇంత మంట వుండేది కాదు..
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న లక్షల కోట్ల అవినీతిలో 10% రైతన్నల సాయం కోసం కేటాయించినా రైతు పరిస్థితి చాలా మెరుగ్గా వుండేది.. లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్ కూడా వేలల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను ఆపలేకపోవటం పాలకుల పాపమా లేక వాళ్ళను ఎన్నుకున్నందుకు మనకు శాపమా..
ఎక్కువ collection వుండే శాఖ కేటాయించలేదు అని అలకపాన్పు ఎక్కినా ఒక్క మంత్రి అన్నా, రైతుకి అందిన సాయం చాలదు అని తెలిసి కూడా నోరు మెదపకపోవటం సిగ్గుచేటు...
రైతులను గ్రామ స్థాయు నుంచి సంఘటితం చేసుకుని, ఉద్యమాలను నిర్మించుకోవాలిసిన సందర్భం వచ్చింది....ప్రాంతాలను, పార్టీలను పక్కనపెట్టి రైతు బిడ్డలుగా రైతన్నల కోసం ఉద్యమానికి నైతిక మద్ధతు తెలుపుదాము..దేశ ఆహార భద్రతకు మన వంతు సాయమందిద్దాము....
చివరగా ఒక చిన్న మాట ...గ్రామీణ భారతం వికసించాలి అన్నా, దేశంలో పేదరిక నిర్మూలన జరగాలన్నా అది మొదలవ్వాలిసింది రైతన్నకు మనో ధైర్యం కల్పించటంతోనే ...వ్యవసాయాన్ని నిజంగా ఫలసాయంగా మార్చలేని నాడు దేశ ఆర్ధిక మూలాలు కూలటం తధ్యం..
ఆర్ధిక సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న యువతరం, ఆ ఫలాన్ని రైతన్నకు పంచేందుకు, ఆరుపదుల వయస్సులో అన్నదాత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడుకి అండగా నిలబదదాము..
(మేలుకో యువత --- కాపాడుకో రైతన్న భవిత)
ఇట్లు,
ఒక రైతు బిడ్డ ...